Stories › Greentext › నేను పుట్టించిన దేవత
Greentext · 1 minనేను పుట్టించిన దేవత
>నేను, ఆరో తరగతి
>గవర్నమెంటు హైస్కూలు, మా ఊరికి రెండు కిలోమీటర్ల దూరం
>రోజూ మా వీధి పిల్లలు నలుగురితో కలిసి నడిచి వెళ్తా
>ఆ సోమవారం ఒక కబడ్డీ మ్యాచ్ ఉంది
>మా వీధి వర్సెస్ సాలెల వీధి
>మధ్యాహ్నం రెండింటికి, చెరువు దగ్గర
>నేనూ టీంలో ఉన్నా
>అందరికంటే చిన్నవాణ్ణి కదా, అందుకే నేనే రైడర్ని
>స్కూలేమో నాలుగింటికి అయిపోతుంది
>అంటే ఆ పూట స్కూలు ఎగ్గొట్టాల్సిందే
>మా ఫ్రెండ్సందరి దగ్గరా లీవ్ లెటర్లు ఉన్నాయి
>ఒకడికి వాళ్ళమ్మ రాసింది, ఇంకొకడికి వాళ్ళన్న రాశాడు
>నా దగ్గరేమో ఏమీ లేదు
>మా అమ్మ లెటర్లు గిటర్లు రాయదు
>సంతలో సార్ కనిపిస్తే నేరుగా ఆయన్నే అడిగేస్తుంది
>అది ఏ లెటర్ కంటే అయినా డేంజరు
>అందుకే పొద్దున్న అటెండెన్స్ టైంలో స్టాఫ్ రూంకి వెళ్ళా
>వెంకటేశ్వర్లు సార్ అక్కడే ఉన్నాడు
>తెలుగు సార్, మా క్లాస్ టీచర్
>"సార్.. ఒక పూట సెలవు కావాలి సార్" అన్నా నసుగుతూ
>"ఎందుకు?"
>"ఇంట్లో పండగ సార్"
>"ఏం పండగ?"
>అంతదాకా నేను అసలు ఆలోచించనే లేదు
>నోరు దానంతట అదే మాట్లాడేసింది
>"గంగ భవాని పండగ సార్"
>"మా ఇంటి దేవత సార్"
>"మూడేళ్ళకి ఒకసారే వస్తుంది సార్"
>సార్ పెన్ను కింద పెట్టాడు
>"గంగ భవానా?"
>"అవును సార్"
>"ఏ గంగ భవాని?"
>"మాదే సార్"
>"గుడి ఎక్కడుంది?"
>"కాలువ దగ్గర సార్"
>"ఏ కాలువ?"
>"మా ఊరి కాలువ సార్"
>ఇప్పుడు ఆయన నన్నే చూస్తున్నాడు
>ఈసారి సరిగ్గా, తేరిపారా
>"ఏ ఊరు?"
>చెప్పేశా
>ఆయన చిన్నగా నవ్వాడు
>అప్పుడే నాకు అర్థమవ్వాల్సింది
>కానీ ఏం చేస్తాం, నేను ఆరో తరగతి కదా
>"నాదీ అదే ఊరు" అన్నాడు నింపాదిగా
>"ఆ కాలువ పక్కనే పుట్టా నేను"
>"ఆ కాలువ దగ్గర ప్రతి రాయీ నాకు తెలుసు"
>"అక్కడ కూర్చునే బండ ఉంది, పంపు హౌసు ఉంది, కల్లు దుకాణం ఉంది"
>"గంగ భవాని మాత్రం లేదు"
>మిగతా టీచర్లంతా ఇప్పుడు చెవులు రిక్కించి వింటున్నారు
>ఎవరో కిసుక్కున నవ్వారు
>"మీరు ఊరొదిలి చాలా రోజులైందేమో సార్" అన్నా
>అలా ఎందుకన్నానో నాకే తెలీదు
>సార్ లేచి నిలబడ్డాడు
>కోపంగా లేడు
>ఇంకేదోలా ఉన్నాడు
>"రా" అన్నాడు
>నన్ను కిటికీ దగ్గరికి తీసుకెళ్ళాడు
>"చెరువు దగ్గర ఆ చింత చెట్టు కనిపిస్తోందా?"
>"దాని వెనకే మా అమ్మ ఇల్లు"
>"మా అమ్మ ఇప్పటికీ అక్కడే ఉంటుంది"
>"ఆవిడకి డెబ్బై ఎనిమిదేళ్ళు"
>"ఆ ఊళ్ళో జరిగే ప్రతి పండక్కీ వెళ్తుంది"
>"ఈ రాత్రి గంగ భవాని గురించి ఆవిణ్ణే అడుగుతా"
>"ఉందని అమ్మ అంటే, రేపు నీకు రోజంతా సెలవు"
>"లేదంటే మాత్రం.."
>మాట పూర్తి చెయ్యలేదు
>"క్లాసుకి పో" అన్నాడు
>వెళ్ళిపోయా
>కబడ్డీకి వెళ్ళలేదు
>మా వీధి నాలుగు పాయింట్లతో ఓడిపోయింది
>రైడర్ లేకపోబట్టే అన్నారు
>ఆ రాత్రి నిద్ర పట్టలేదు
>సార్ వాళ్ళమ్మ గురించే ఆలోచిస్తున్నా
>డెబ్బై ఎనిమిదేళ్ళ ఆవిడ
>తల్లో ఒక్కో దేవుణ్ణీ గుర్తు చేసుకుంటూ వెతుకుతూ ఉంటుందేమో
>మర్నాడు పొద్దున సార్ క్లాసుకొచ్చాడు
>అటెండెన్స్ తీసుకున్నాడు
>నా వైపు చూడలేదు
>పీరియడ్ మొత్తం తెలుగు పద్యం చెప్పాడు, ఒక్కసారి కూడా నా వైపు చూడలేదు
>చివర్లో "నువ్వుండు" అన్నాడు
>అందరూ బయటికెళ్ళిపోయారు
>నా పక్కనే బెంచీ మీద కూర్చున్నాడు
>"మా అమ్మ ఒక విచిత్రమైన మాట చెప్పింది" అన్నాడు
>నేను నేల వైపు చూస్తున్నా
>"గంగ భవాని ఉండేదంట"
>ఉలిక్కిపడి తల ఎత్తి చూశా
>"పంపు హౌసు వెనకాల, ఒక వేప చెట్టు కింద ఒక చిన్న రాయి"
>"జనం దానికి పసుపు రాసేవాళ్ళంట"
>"కాలువ వెడల్పు చెయ్యక ముందు"
>"అది నలభై ఏళ్ళ కిందటి మాట"
>"ఇప్పుడు ఎవరికీ గుర్తు లేదు"
>"ఈ కాలం పిల్లాడికి అదెలా తెలిసిందా అని అమ్మ ఆశ్చర్యపోయింది"
>ఏం చెప్పాలో తెలీలేదు
>నిజానికి నాకు తెలీదు
>అదంతా నేనే అల్లేశా
>కాదు, నా నోరే అల్లేసింది
>"సరే మరి" అన్నాడు సార్
>"ఈసారి మీ ఇంట్లో ఆ పండగ చేసినప్పుడు"
>"నాకు చెప్పు"
>"నేనూ వస్తా"
>లేచి వెళ్ళిపోయాడు
>పండగ లేదని ఆయనకి ఎప్పుడూ చెప్పలేదు
>ఆయనా మళ్ళీ ఎప్పుడూ నిలదీసి అడగలేదు
>కానీ ప్రతి ఏడాదీ సరిగ్గా ఆ టైంకి ఒక మాట అడిగేవాడు
>"ఈ ఏడాది గంగ భవాని ఉందా?"
>"ఈ ఏడాది లేదు సార్"
>"మూడేళ్ళకి ఒకసారే కదా సార్"
>ఆయన తల ఊపేవాడు
>పదో తరగతి అయ్యాక ఆ స్కూలు వదిలేశా
>సార్ రిటైరయ్యాడు
>పోయినేడాది ఒక ఫంక్షన్‌కి ఊరెళ్ళా
>సాయంత్రం కాలువ దాకా నడిచా
>పంపు హౌసు వెనక్కి వెళ్ళా
>అక్కడ ఒక వేప చెట్టు ఉంది
>దాని కింద ఒక రాయి
>ఎవరో దానికి కొత్తగా పసుపు రాశారు
❦


