Thoughting.in
ENతె

Stories › Romance › ఇరవై ఒక్క రోజులు

Romance · 1 minరెండు రోజుల గడువు

సెప్టెంబరులో ఒక శుక్రవారం. ప్రతి శుక్రవారంలాగే ఆ రోజు కూడా ప్రమోద్ ఆఫీసు నుంచి తొందరగా వచ్చాడు, లాస్య ఎప్పటిలాగే టీ రెడీగా పెట్టింది. నిజానికి కథ అక్కడితో అయిపోవాలి. కానీ ఆ రోజు అతని చేతిలో మామూలుగా తెచ్చే అరటి చిప్స్ పొట్లం బదులు ఒక కవరు ఉంది. పైగా లోపలికి వచ్చినా కూర్చోలేదు.

"ఏంటండీ అలా ఉన్నారు? జీఎస్టీ డిపార్ట్‌మెంటే మీకు నోటీసు పంపినట్టు మొహం పెట్టారు.." నవ్వుతూ అడిగింది.

"పంపారు," అంటూ ఆ కవరు ఆమె చేతిలో పెట్టాడు.

ఆడిట్ క్యాంపు. దీవులు. మూడు వారాలు. సోమవారం పొద్దున్న కొచ్చి నుంచి ఓడ. ఈ ఆదివారం రాత్రికల్లా కొచ్చి ఆఫీసులో రిపోర్టు చేయాలి. ఆర్డరులో రెండు పేర్లు ఉన్నాయి, అందులో రెండోది అతనిది.

లాస్య దాన్ని రెండుసార్లు చదివింది. "సోమవారమా? అంటే.. ఈ సోమవారమే?"

"ఇరవై ఒక్క రోజులు," అన్నాడు. అతను అప్పటికే లెక్కపెట్టేశాడు. మధ్యాహ్నం రెండు గంటల నుంచీ మనసులో అదే లెక్క. అందుకే ఆ రోజు ఒంటిగంట ఫోను కూడా తొందరగా ముగించేశాడు. ఆమె గమనించింది, ఏదో పని హడావిడి అనుకుంది. నిజమే, పనే.

లాస్య ఆర్డరు టేబుల్ మీద పెట్టేసి, "కాదనలేరా?" అని అడిగింది ఆశగా.

"ఆర్డరు లాస్యా. జూనియర్ స్టాఫ్ వెళ్ళాల్సిందే. సజిత్ సార్ కూడా రెండేళ్ళ క్రితం వెళ్ళొచ్చారు. అక్కడ అంతా సముద్రం, ఫైళ్ళు.. ఇంకేమీ ఉండవు అన్నారు."

"మరి మీ మొహం ఎందుకు అలా ఉంది?"

"ఎలా?"

"ఇప్పటికే వెళ్ళిపోయినట్టు."

అప్పుడు ఎట్టకేలకు కూర్చున్నాడు. టీ తాగుతూ, "టాక్ యూ టునైట్," అన్నాడు చిన్నగా నవ్వి. అంతే, చేతిలో ఉన్న టీ జల్లెడ అతని మీదకి విసిరేసింది లాస్య.

ఆ రాత్రి ఇద్దరూ కూర్చుని లిస్టు రాశారు. రాసింది లాస్యే, ఎందుకంటే ప్రమోద్ లిస్టులో మూడు వస్తువులుంటే ఆమె లిస్టులో ముప్ఫై ఉంటాయి. ఆరు షర్టులు, రెండు ప్యాంట్లు, మంచి చెప్పులు, పాత చెప్పులు, కడుపు నొప్పి టాబ్లెట్లు, టార్చి, టవల్. ఇంకా అమ్మ చేసిన పొడి ఒక చిన్న స్టీలు డబ్బాలో. అక్కడ అన్నం ఎలాగూ అన్నమే, కానీ పొడి తింటే ఇల్లు గుర్తొస్తుంది కదా. వంటల పుస్తకంలో కొత్త పేజీ తీసి అన్నీ రాసింది. చివర్లో "ఒంటిగంట" అని రాసి, దాని వంక కాసేపు చూసి, కొట్టేసింది.

"అదేంటి?" అడిగాడు.

"ఏం లేదు.. బ్యాగులో సర్దలేని ఒక్క వస్తువు."

అతనికి అర్థమైపోయింది. చిన్న చిన్న విషయాలు అతనికి ఇట్టే అర్థమవుతాయి, పెద్ద విషయాలకే కాస్త టైము పడుతుంది. "క్యాంపులో సిగ్నల్ ఉండదు," అన్నాడు మెల్లగా. "సజిత్ సార్ చెప్పారు. మొబైల్ అసలు పనిచేయదు. క్యాంపు ఆఫీసులో ఒకే ఒక్క శాటిలైట్ ఫోను ఉంటుంది. ఒక్కొక్కరికి రోజుకి పది నిమిషాలు. లైన్లో నిలబడాలి, మన వంతు వచ్చాక పది నిమిషాలు. పక్కనే ఒక క్లర్కు వాచీ పెట్టుకుని కూర్చుంటాడు."

"పది నిమిషాలా?"

"పది."

"ఏ టైముకి?"

"అదే కదా సమస్య. టైము మనం ఎంచుకోలేం. లైను ఎలా కదిలితే అలా. పొద్దున్న కావచ్చు, రాత్రి పదకొండు కావచ్చు."

లాస్య గుమ్మం పక్కనే చిన్న టేబుల్ మీద గుడ్డ కవర్ కప్పిన ల్యాండ్‌లైన్ వంక చూసింది. అమ్మకి ఏదైనా వంట రెసిపీ వెనక్కి కావాలనిపించినప్పుడు తప్ప మోగని ఫోను అది. ఇప్పుడు ఆంతూర్‌కీ ఆ సముద్రానికీ మధ్య మిగిలిన ఒకే ఒక్క దారి అదే.

"అయితే ఈ ల్యాండ్‌లైన్ మీదే," అంది. "ఇరవై ఒక్క రోజులూ."

పెన్ను తీసుకుని, అతని చెయ్యి లాక్కుని, ముంజేతి లోపలి వైపు ఆ నంబరు రాసింది.. స్కూలు పిల్లలు ఎగ్జామ్‌కి జవాబులు రాసుకున్నట్టు. అతను కదలకుండా రాయనిచ్చాడు. ఆ నంబరు తనకి కంఠతా వచ్చని కూడా అనలేదు. నిజంగానే వచ్చు. కానీ ఇక్కడ సంగతి అది కాదు కదా.

"స్నానం చేస్తే చెరిగిపోతుంది," అన్నాడు.

"అయితే స్నానం చేయకండి."

"ఇరవై ఒక్క రోజులు?"

"అయితే మళ్ళీ రాసుకోండి," అంది పొగరుగా.

* * *

ఆదివారం పొద్దున్నే "బీచ్‌కి వెళ్దాం" అన్నాడు. "మూడు వారాల్లో జీవితంలో చూడనంత సముద్రం చూడబోతున్నారు కదా," అంది వెటకారంగా. "కానీ అది ఈ సముద్రం కాదు గా," అన్నాడు. అంతే, బయలుదేరారు. మట్టూల్, బైకు మీద అరగంట. అతను చాలా దూరం ఈదుకుంటూ వెళ్ళి వెనక్కి వచ్చాడు. ఆమె చెప్పులు చేత్తో పట్టుకుని ఒడ్డు వెంట నడుస్తూ పగలని గవ్వలు ఏరుకుంది, పగిలినవి మళ్ళీ అక్కడే వదిలేసింది. అతను తడిసిన ఒంటితో బయటికి రాగానే ఆ రోజు ఏరిన గవ్వలన్నీ అరచేతిలో పెట్టి చూపించింది.

"దీవిలో ఇంతకంటే మంచివి ఉంటాయి," అన్నాడు. "పెద్ద పెద్ద తెల్లటి గవ్వలు. సజిత్ సార్ అమ్ముకి ఒకటి తెచ్చారు."

"అయితే నాకూ ఒకటి తెండి."

"ఒక్కటేనా?"

"ఒక్కటి చాలు. మంచిది.. ఒక్కటి."

తెస్తానన్నాడు. సూర్యుడు నీళ్ళలోకి దిగిపోయేదాకా ఇద్దరూ ఇసుకలో కూర్చున్నారు. సోమవారం గురించి ఇద్దరిలో ఎవరూ ఒక్క మాట కూడా అనలేదు. వాళ్ళు ఒకరికొకరు చెప్పుకున్నది కూడా అలాగే.

* * *

సోమవారం తెల్లవారుజామున నాలుగింటికి, ఇంకా చీకటి ఉండగానే సజిత్ చిన్న కారు గుమ్మం ముందు ఆగింది. సజిత్ అలాంటి మనిషి మరి. ఆ ఇద్దరూ మెట్టు మీద నిలబడి ఉంటే, అతను కారు పక్కన నిలబడి ఆకాశం వంక చూస్తూ ఉండిపోయాడు. బ్యాగు పైన పొడి డబ్బా.

"సరిగ్గా తినండి," అంది.

"నువ్వు తిను," అన్నాడు. "నేను లేకపోతే నువ్వు తినవు. టీ తాగేసి తిన్నాను అని చెప్తావు, నాకు తెలుసు."

"తింటాను లెండి."

"టాక్ యూ టునైట్."

"ఇంకో ఇరవై ఒక్క రోజులు మనకి టునైట్ అనేదే లేదండీ.." అంది గొంతు బొంగురుపోతుంటే.

"అయితే ఇరవై ఒక్కటి బాకీ ఉంటాను."

ప్రమోద్ బ్యాగుతో మెట్టు దిగి సజిత్ కారు ఎక్కాడు, కిటికీలోంచి చెయ్యి ఊపాడు. ఆమె మెట్టు మీదే నిలబడి చెయ్యి ఎత్తింది. కారు మలుపు దాకా వెళ్ళి తిరిగిపోయింది. అక్కడ ఇక ఎవరూ లేకపోయినా ఆమె చెయ్యి ఇంకాసేపు అలాగే గాల్లో ఉండిపోయింది.

లోపలికి వెళ్ళి తలుపు వేసుకోగానే ఆ చిన్న ఇల్లు ఒక్కసారిగా స్టేడియం అంత పెద్దదైపోయింది.

ఇల్లంతా తుడిచింది. అప్పటికే శుభ్రంగానే ఉంది, అయినా తుడిచింది. తర్వాత రాక్ మీద ఉన్న రెండు కప్పుల్లో ఒకటి తీసి బీరువాలో పెట్టేసింది, అది తన వంకే చూస్తున్నట్టు అనిపించి. పదకొండింటికి సిగ్నల్ బాగా వచ్చే కిటికీ దగ్గర నిలబడి అమ్మకి ఫోన్ చేసి ఆయన వెళ్ళిపోయారని చెప్పింది. "మూడు వారాలు ఒక్కదానివే ఎలా ఉంటావే?" అంది అమ్మ బెంగగా. "నేను పెళ్ళైనదాన్నమ్మా.. మేనేజ్ చేసుకుంటాను," అంది లాస్య గొప్పగా.

ఒంటిగంట కాగానే అలవాటుగా ఫోన్ వంక చూసింది. మోగలేదు. ఇంక మోగే అవకాశం కూడా లేదని తెలుసు, అయినా చూసింది. అన్నం వండుకుని సగం తిని, మిగతా సగం మీద ప్లేటు బోర్లించింది.

ఆ రాత్రి మంచం మీద తన వైపే ఒత్తిగిలి పడుకుంది. తెరిచిన తలుపులోంచి ల్యాండ్‌లైన్ కనిపిస్తోంది. పైకప్పు మీద వాన ఆగుతూ కురుస్తూ ఉంది. పదకొండింటికి ఇక ఆశ వదిలేసి లైటు ఆర్పేసింది.

పదకొండు నలభైకి ల్యాండ్‌లైన్ మోగింది.

పాత ల్యాండ్‌లైన్లు మోగినట్టే.. స్కూల్లో గంట కొట్టినట్టు గట్టిగా. పూర్తిగా మెలకువ రాకముందే మంచం దిగేసింది. చీకట్లో కాలు కుర్చీకి తగిలి, కుర్చీతో సహా కింద పడిపోయింది. అయినా లేచే ఓపిక లేక చివరి మీటరు పాకుతూనే వెళ్ళి, నాలుగో రింగుకి రిసీవర్ అందుకుంది.

"హలో? హలో.. అండీ?" ఊపిరి బిగబట్టి అడిగింది.

లైన్లో గరగరమని శబ్దం. దాని కింద ఎక్కడో చాలా దూరంగా ఫ్యాను తిరుగుతున్న ఒక గది. తనకి తెలియని ఒక మగ గొంతు విసుగ్గా, "ఇంకా తొమ్మిది నిమిషాలు," అంది.

ఆ తర్వాత ప్రమోద్. "లాస్యా."

"అండీ.. అండీ, చేరిపోయారా?"

"చేరాను. ఓడలో పద్నాలుగు గంటలు. లాస్యా, ఇక్కడ ఎటు చూసినా సముద్రమే. క్యాంపు అంటే కొబ్బరి చెట్లు ఉన్న ఒక చిన్న దీవి, ఆఫీసు ఒక రేకుల షెడ్డు. తిండి అన్నం, చేపల పులుసు.. నేను పొడి వేసుకుని తిన్నాను. ఇక్కడ ఒకాయన తొమ్మిది నిమిషాలు అంటున్నాడు, వెనకాల లైను ఉంది. ఇంతకీ నువ్వు తిన్నావా?"

"తిన్నాను."

"తినలేదు."

"సగం తిన్నాను.." ఒప్పుకుంది.

అతను నవ్వాడు. ఆ నవ్వు గరగరతో కలిసి సముద్రం దాటి వచ్చింది. పక్కనే ఒరిగిపోయిన కుర్చీ, తను నేల మీద కూర్చుని, రెండు చేతులతో రిసీవర్ గట్టిగా పట్టుకుంది లాస్య.

"లాస్యా, విను. రోజూ టైము మారుతుంది. తెల్లవారుజామున మూడింటికి మోగిందంటే నా వంతు మూడింటికి వచ్చిందని అర్థం. ఏ రోజైనా ఫోన్ రాలేదంటే లైను పెద్దగా ఉందనో, ఫోన్ పనిచేయలేదనో.. అంతే, ఇంకేమీ కాదు. అర్థమైందా?"

"అర్థమైంది."

"ఇంకో సంగతి.. ఆ నంబరు ఓడలోనే చెరిగిపోయింది. ఒక్కసారి చెప్పు."

నవ్వుతూనే చెప్పింది. అతను తిరిగి చెప్పాడు. ఆ విసుగు గొంతు "ఒక్క నిమిషం" అంది. ప్రమోద్ ఒక గవ్వ గురించి ఏదో చెప్పబోయాడు. పెద్దది, తెల్లది, ఇప్పటికే ఒకటి చూశాడట, తప్పకుండా తను..

సరిగ్గా పది నిమిషాలకి, ఆ వాక్యం మధ్యలోనే లైను కట్ అయిపోయింది. గరగర ఆగిపోయింది. గది మళ్ళీ మామూలు గది అయిపోయింది.

చీకట్లో వంటింటి నేల మీద కూర్చుని, రెండు చేతుల్లో రిసీవర్, అందులోంచి డయల్ టోన్ వినిపిస్తూనే ఉంది. లాస్య నవ్వుతూనే ఉంది. చాలాసేపటి దాకా ఆ రిసీవర్‌ని కింద పెట్టనే లేదు.

❦

Leave a thought

What did this leave with you?

Thoughts wait unseen until we heart them. Hearted ones appear on the story page, newest first, under your name.