Stories › Romance › రాత్రికి చెప్తా
Part 2 of 6 · 1 minఅర్ధరాత్రి కాల్
వెంటనే హాస్పిటల్ కి కాల్ చేసి ఆంబ్యులెన్స్ పిలిపించారు. దోవలో రెండు సార్లు వాంతులు కూడా అయ్యాయి. హోటల్ మేనేజర్ ప్రమోద్ కి తోడుగా వెనకే వచ్చాడు, ప్రమోద్ గాబరా చూసి, తనకు బాష రాదని అర్థం చేసుకొని.
జనరల్ డాక్టర్ కొన్ని పరీక్షలు చేసి, నవ్వుతూ బైటకి వచ్చాడు. “తను తిన్న ఫిష్ ఐటం వల్ల తనకు అలెర్జీ వచ్చింది, చాలా తక్కువమందికి ఇలా అలెర్జీ వస్తుంది, కానీ, దీని మందు మటుకు ఇక్కడ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. ఫారిన్ టూరిస్టులకు, ఇమ్మ్యూనిటి తక్కువ ఉండే వారికి ఇలా జరుగుతుంది” అని చెప్పాడు జోసెఫ్ మిన్నెల్, “అబ్సెర్వేషన్లో ఉంటుంది, రేపు సాయంత్రానికి డిశ్చార్జ్ చేస్తాం.”అని ముగిస్తూ. విషయం ఆఫీసు వాళ్ళకు చెప్పి, 3 రోజుల సెలవుకు అర్జీ పెట్టాడు, “భార్య సేవ భాగ్యం” పధకం కింద. ముఖ్య అతిదులు లాస్య తల్లి తండ్రులు.
మొదటి రోజు హాస్పిటల్ లో భార్యను చూసుకుంటూ గడిచిపోయింది. సాయంత్రానికి ఇల్లు చేరారు, ఇడ్లీ తెప్పించుకొని తిన్నారు. లాస్య మాత్రల ప్రభావం వల్ల నిద్రకు జారుకుంది. చేయాల్సింది ఏం లేక “Oppenheimer” సినిమా మొదలెట్టాడు ప్రమోద్. మధ్యలో లాండ్ లైన్ మోగింది, ఫోన్ ఎత్తి మాట్లాడాడు ప్రమోద్. శబ్దానికి నిద్ర లేచింది లాస్య, ఈ సమయంలో ఎవరు కాల్ చేశారా అని. చొక్కా మార్చుకుంటూ tv ఆపేశాడు ప్రమోద్. “ఈ టైమ్ లో కాల్ ఎవరు చేశారండి ? ఇంత రాత్రిలో ఎందాక?” అంది నిద్ర మత్తులో. ”నిదానం, అన్నీ రాత్రికి చెప్తా. ఇల్లు సర్దు, కాస్త నవ్వు. వచ్చే వాళ్ళు నిన్నిలా చూసి ఏమనుకుంటారు” చెప్తూ గుమ్మం దాటాడు ప్రమోద్. ఇల్లు సర్దేంత ప్రముఖులు ఇక్కడ ఎవరున్నారు? ఉన్నా, వాళ్ళకు నాతో కానీ, నా మొఖంతో గాని, ముఖ్యంగా నా నవ్వుతో పనేమిటి అని ఆలోచిస్తూ, నిద్రలోకి జారుకుంది.
· · ·