Thoughting.in
ENతె

StoriesRomanceరాత్రికి చెప్తా

Part 1 of 6 · 1 minసర్ప్రైజ్

"33 గంటలలో మళయాళం” అనే యూట్యూబ్ వీడియోని చూస్తున్న లాస్య దీక్షను భంగం చేస్తూ “ట్రింగ్ ట్రింగ్”అని కాల్. ఆశ్చర్యంతో కాల్ ఎత్తగా, అది ప్రమోద్ అని తెలిసింది . సహజంగా 1 గంటకు కాల్ చేస్తాడు, 6 గంటలకు ఇల్లు చేరతాడు. కానీ ఈ సారి, వింతగా 3 కి చేశాడు. “ఏంటండీ, ఈరోజు లేట్ అయ్యింది. కాల్ రాకపొయ్యేసరికి ఏం తోచలేదు. వర్క్ కూడా లేదన్నారు.” అడిగింది లాస్య. “ఏం లేదు, 5గంటలకి రెడీ గా ఉండు, నీకో సర్ప్రైస్” అన్నాడు జవాబుగా.

అంతూర్, కేరళలో ఒక చిన్న టౌన్. ప్రమోద్ కి రెండు నెలల క్రితమే ట్రాన్స్ఫర్ అయ్యింది. తను “గూడ్స్ &సర్వీస్ టాక్స్” డిపార్ట్మెంట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. పుట్టుకతో ప్రమోద్ ఒక పల్లెటూరు మనిషి, నెల్లూర్ లోని మనుబోలు వాడు . కృషితో , తల్లితండ్రుల దీవెనలతో డిగ్రీ పూర్తి చేసి, పట్టుదలతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. ప్రొబేషన్ పీరియడ్ ముగియగానే ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఎంత ప్రభుత్వ ఉద్యోగం అయినా, తక్కువ జీతం అయ్యేసరికి కుదరకుండా పోతున్నాయి సంబంధాలు . ఇంట్లో వాళ్ళకి చదువుకున్న అమ్మాయి, కాస్త లౌకికం తెలిసిన అమ్మాయి అయితే చాలు, కట్నం కూడా వద్దని నచ్చచెప్పాడు.

కానీ, ప్రమోద్ అదృష్టానికి లాస్య బి. టెక్ చదువుకున్న అమ్మాయి. ఇంటర్ నుండి హైదరాబాద్ లో అమ్మానాన్నలతో పాటు ఇంట్లో ఉండేది. చిన్నప్పటినుండి కొంచం గారాబంగా పెంచారు అమ్మాయిని, ఒక్కతే బిడ్డ అవ్వటంతో. చదువుతో పాటు, సంస్కారం ఉన్నా, పక్కనే ఉండే స్నేహితుల ప్రభావం కొంచం ఎక్కువగానే పడింది లాస్య మీద. అప్పుడప్పుడు పాఠాలు బంక్ కొట్టి సినిమాలకు పోవటం నుంచి, స్టడీ ట్రిప్ అని చెప్పి టూర్ కి వెళ్ళటం వరకు చాలా కళలు నేర్పారు.

తన మొదటి ప్రయత్నం లోనే ప్రమోద్ కి నచ్చటం, అందులో ప్రమోద్ పల్లెటూరు వాడు , నెమ్మదస్తుడు, అవ్వడం చేత లాస్యకు లోకువగా కనిపించాడు. అంటే అబ్బాయి తక్కువ అని కాదు, అబ్బాయి కన్నా తానే ఎక్కువ అని. చూపులు, వెంటనే నిశ్చితార్ధం, నెల గడువులో పెళ్లి కూడా నిశ్చయం అయ్యింది. లాస్య తండ్రి, కూతురికి ప్లాటినం దండ, అల్లుడికి కొత్త బండి ఇచ్చాడు . అందరూ తనది అదృష్టం అంటుంటే, తను ఎచ్చులు పోయింది. హనీమూన్కి వెళ్ళి, వచ్చేలోపే ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ చేతికి వచ్చాయి. అండమాన్ దీవుల ప్రశాంతంగా ముచ్చటించుకున్నారు. లాస్య గురించి, తన స్నేహితుల గురించి, నచ్చిన సినిమాల గురించి, తిరిగిన ట్రిప్పుల గురించి ప్రమోద్ కి తెలిసింది ఇక్కడే. ఈ విషయాల ప్రస్తావన ఇంట్లో తేకూడదని మాట తీసుకుంది లాస్య.

తిరుగు ప్రయాణం ముగియగానే ప్రమోద్ కేరళకు ప్రయాణం, ఆ వెంటనే ఆషాడమాసం అన్నీ కలిసొచ్చాయి. దంపతుల మధ్య దూరం పెరిగినా, ఆ సమయాన్ని ఇల్లు సర్దుబాట్లకు ఉపయోగించుకున్నాడు. ఆఫీసు క్వాటర్స్ ఇచ్చింది, 1 bhk , మంచి ఇల్లు కావాలి అంటే ఇంకో 4 నెలలు ఆగాలి. క్వాటర్స్ లో ఇంకో సమస్య సెల్ సిగ్నల్, అస్సలు ఏ సిగ్నల్ రాదు బిఎస్ఎన్ఎల్ తప్ప. ఇక కొత్త కాపురానికి కావాల్సిన వస్తువుల గురించి రోజూ మధ్యాహ్నం మాట్లాడుకునేవారు. వారం గడిచేసారికి కాల్ కోసం అగచాట్లు కాస్త, అలవాటు గా మారిపోయ్యింది, నెల రోజులు ఆట్టే గడిచిపోయాయి. లాస్య గృహప్రవేశం చేసి పాలు, పెరుగు కన్నా ముందు సిమ్ కార్డ్లూ , ఒక లాండ్ లైన్ తీసుకున్నారు. ల్యాండ్లైన్ పెట్టించింది మటుకు కేవలం పుట్టింటి వాళ్ళకు, మెట్టింటి వాళ్ళకు క్షేమ సమాచారాలు తెలపటానికి.

కాల్ అయిపోయిన అర్ధ గంటకు ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు ప్రమోద్. “ఏమిటండీ విశేషం? తొందరగా వచ్చేశారు. శుక్రవారం కూడా కాదు.” అడిగింది లాస్య కుతూహలంగా. శుక్రవారం అయితే వారం చివరి పని రోజని త్వరగా వచ్చేస్తాడు. కానీ ఈరోజు అదీ కాదు. ఒక డిటెక్టివ్ లాగా ఆలోచించింది ఇంతసేపు, కారణం కోసం. “రాత్రికి చెప్తా” అన్నాడు. ఆ నవ్వు మామూలుది కాదు. “ఛీ, ఏంటండీ ఆ నవ్వు” అంటూ లోపలికి పరిగెత్తింది లాస్య, చెవులు వేడెక్కగా. ఐదు గంటలకు ఇంటి దగ్గర మొదలైన బండి, అరగంటలో మటూల్ బీచ్ కి చేరింది . సముద్రతీరం అంటే ప్రమోద్ కి చాలా ఇష్టం , లాస్య కి ఆ బీచ్ ఆ రోజుకి భయం వేసింది . ప్రమోద్ ఈదినంతసేపు, ఒడ్డుమీద ఉన్న గవ్వలు ఏరుకుంది లాస్య. 7 కి మళ్ళీ మొదలైన బండి 7:30 ఆగింది. తనను దిగమని చెప్పి, హోటల్ పార్కింగ్ లాట్ లో దూరాడు ప్రమోద్. రిసెప్షన్ దగ్గర కూర్చున్న తనను, మెట్ల మీదగా ఫస్ట్ ఫ్లోర్ కి తీసుకెళ్ళాడు ప్రమోద్. అక్కడ ఒక మూలగా గాలి తగిలేలా, బైట పారుతున్న నది కనిపించేలా అనువుగా ఉన్న టేబుల్ రిజర్వ్ చేసి ఉంచాడు. కేరళ వచ్చిన కొత్తలో ఆ దారిలో వెళ్తూ “ఈ హోటల్ కి ఒకసారి వెళ్దామండి” అని లాస్య అన్న మాట గుర్తుపెట్టుకున్నాడు ప్రమోద్. సర్ప్రైజ్ అంటే అదే, అంతకు మించి ఏం లేదు.

కూర్చొని, 2 సూపులు, ఒక మలబార్ ఫిష్ కర్రీ, బట్టర్ నాన్ ఆర్డర్ ఇచ్చాడు. సూపు తాగుతూ కబుర్లు ప్రారంభించారు. కర్రీ పేరు లాస్య కు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. ఆ ట్రీట్ కి కారణం తెలియలేదే అనే బాధ కన్నా, ఈ పూట వంటింటి నుంచి విముక్తి దొరికింది అని ఆనందం ఎక్కువగా కనిపిస్తోంది. రెండో నాన్ పూర్తి చేసి,మూడోవ నాన్ మధ్యకు వచ్చేసరికి, ఏదో ఇబ్బంది మొదలైంది లాస్యకు. కడుపు పట్టుకొని కింద పడిపోయింది.

· · ·

Leave a thought

What did part 1 leave with you?

Thoughts wait unseen until we heart them. Hearted ones appear on the story page, newest first, under your name.