Thoughting.in
ENతె

StoriesRomanceరాత్రికి చెప్తా

Part 3 of 6 · 1 minఅనుకోని అతిథులు

ఇంటి బెల్ మ్రోగేసరికి, నిద్రలేచింది లాస్య. తలుపు తీసిన లాస్య మొహం ఆనందం తో విచ్చుకుంది, తన తల్లితండ్రులను చూసేసరికి. తెచ్చిన ఇడ్లీలు అయిపోయేసరికి అమ్మ ఉప్మా చేసింది. అందరూ నిద్రకు జారారు.

ఉదయం తల్లి కూతుళ్లను కబుర్లకు వదిలేసి, మామాఅల్లుళ్ళు మార్కెట్ కి వెళ్లారు, వంట సరుకులు, కూరగాయలు తేవడానికి. అత్తయ్య కోడికూర బిరియాని బాగాచేస్తారని లాస్య దగ్గర విన్నాడు. అన్నిటితోపాటు తనకు ఇష్టమైన పొట్లకాయ తెచ్చుకున్నాడు, పెరుగు పచ్చడి కోసం. వంటలు పూర్తయ్యాయి, తినటం కూడా. తోచుబడి కోసం టీవీలో కన్నూర్ స్క్వాడ్ చూశారు. కూతురి పరిస్థితి కొంచం బాగయ్యేసరికి, ఏం అయ్యిందో కనుక్కునే ప్రయత్నం చేశారు మామగారు.

ప్రమోద్ జరిగిందంతా చెప్తూ, అనుకోకుండా లాస్య కేరళకు వెళ్ళిన సంగతి చెప్పేశాడు. కానీ వెంటనే ‘తన అమ్మతో వెళ్ళాను అని చెప్పింది’ అని కవర్ చేశాడు. మామగారికి అంతా అర్థం అయినా కేరళకి రీసెంట్ ట్రిప్ అన్నదగ్గర కొట్టుకుంటున్నాడు. వెంటనే అత్తగారు అందుకొని “అదీ, దాని వేషాలు. ఏం లేదు బాబు, లాస్య నాతో కలిసి పంబా నది దాకా వచ్చాము, ఈయన స్వామి మాల వేసినప్పుడు. అంటే దాని వయసు 10 ఏళ్లు ఉంటాయి. ఎక్కడి కెళ్ళామో, ఏం తిన్నామో కూడా గుర్తుండదు”. “ఓహో ఆ ట్రిప్పా ,’ ఈ మధ్యన’ అనగానే అర్థం కాలేదు. ఇల్లు దాటి కాలేజీ కి తప్ప ఎటు వెళ్ళదు. గట్టిగా ఇంటి పక్కన గుడికి కూడా వెళ్ళదు, పక్కన అమ్మ లేకుంటే. దేశాలు తిరిగేసాను, ప్రముఖులను కలిసేశాను అని డాబు చేద్దామనుకుంది ఏమో. “ అంటూ మామగారు కూతురు నెత్తిన ఒక మొట్టు మొట్టారు.

కూతురు కుదుటపడింది అని, బిరియాని మరుసటి రోజుకి ప్లాన్ చేసుకున్నారు, బాద్యతలు పంచుకున్నారు. ప్రస్తుతానికి తింటూ ఏం చూద్దాం అని ఆలోచిస్తుండగా, లాస్య రిమోట్ లాక్కుంది. “నిన్న నా మొగుడు ఏ సినిమా చూస్తున్నాడో నాకు తెలియాల్సిందే.” అనుకుంటూ, “ఇప్పుడు నేను పెట్టిందే చూడాలి” అని ప్రైమ్ పెట్టింది. తన కళ్ళు , రిమోట్ సెలెక్షన్ రెండు “ఒపెన్హైమర్ “ దగ్గర ఆగాయి.

అమ్మ నటీనటులు, దర్శకనిర్మాతల పేర్లు చదివింది. వెంటనే మామగారు గట్టిగా నవ్వారు. “ఏమిటండీ అలా నవ్వారు” అని అత్తగారు అడగగా, “నీకు గుర్తుందా, ఫ్రెండ్స్ తో సినిమాకు వెళతాను అని ఆడగగానే, పంపాను. సినిమా అంతా చూసి కధా సారాంశానికి కష్ట పడింది. మనం డబ్బింగ్ చూస్తూ ఇబ్బంది పడ్డాము.” అని చెప్పాడు మామగారు. “అవునండి, చివరలో బొంగరం తిరిగుతుంది అదే కదా?” అని అందుకుంది అత్తగారు. “అది వేరే సినిమా అమ్మా” అని చెప్పబోయి ఆగిపోయింది లాస్య. చెప్తే, ఆరోజు ఏ సినిమాకు వెళ్ళిందో కూడా చెప్పాల్సి వస్తుంది.

· · ·

Leave a thought

What did part 3 leave with you?

Thoughts wait unseen until we heart them. Hearted ones appear on the story page, newest first, under your name.