Stories › Romance › రాత్రికి చెప్తా
Part 6 of 6 · 1 minతిరుగు ప్రయాణం
ఉదయాన్నే ఆఫీసుకి వెళ్లిపొయ్యాడు ప్రమోద్. ఊరికెళ్ళే లోపు కూతురుకి అందుబాటులో ఉండాల్సిన పొళ్ళు, పచ్చళ్లు, చిరుతిళ్ళు చేయాలని నిశ్చయించుకున్నారు అత్తామామలు. మామగారు సామాన్లకు తిరగటం, తిరగళ్లు తిప్పడం లాంటి పనులు పెట్టుకున్నాడు, అత్త ఏమో వంట చేయటం, రెసిపీలు చెప్పడం మొదలెట్టారు. కూతురు ల్యాబ్ ప్రాక్టికల్స్ విద్యార్థి లాగా శ్రద్ధగా వింటూ, రాసుకుంది.
అల్లుడు నుంచి కాల్ వచ్చింది, మామగారు అందుకొని లాస్య కి ఇచ్చాడు. ఆ రోజు చేసిన పనులన్నీ చెప్పగా, తనకు నెయ్యితో, చక్కెరతో చేసిన మినప సున్నుండ చేస్తారేమో కనుక్కోమని అడిగాడు. కూతురు హుషారును చూసి, అంతా సర్దుకుంది అని తేల్చుకుని, తిరుగు ప్రయాణం టికెట్ బుక్ చేసుకున్నారు పెద్దలు. ప్రమోద్ ఇంటికి రాగానే విషయం చెప్పింది లాస్య. “మరి రెడీ క, మళ్ళీ హోటల్ తిండి తిని మంచం ఎక్కు, ఇంకో వారం రోజులు ఉంటారు.” అన్నాడు ప్రమోద్ నవ్వుతూ. “ఎందుకండి? మేము చేసిన వెరైటీలు తినమనండి, రోజూ గుర్తుకొస్తాము.” అని అత్తగారు అందుకున్నారు, ప్రమోద్ కి సున్నుండ అందిస్తూ.
“ఇంత బాగా చేస్తే, మీరు వారం రోజులకంటే ఎక్కువ గుర్తుకురారండి. నాకైతే 3 రోజులు, మీ కూతురు కాబట్టి ఒక వారం. అంతా కంటే ఎక్కువ రోజులు మా కళ్ళ ముందు కనిపించవు. అంత బాగా చేశారు. కుదిరితే ఇంకోటి ఇవ్వండి.” అడిగాడు ప్రమోద్.
“అలా తింటే కడుపునొప్పి వొస్తుంది” అన్న లాస్య మాటలకు, “వస్తే మన మంచికే, అత్తామామా గార్ల టికెట్ కాన్సెల్, నీకు తోచుబాటు అవుతుంది, నాకు చిరుతిళ్ళు కూడా వస్తాయి.” అంటూ బదులిచ్చాడు. అత్త మామలను ట్రైన్ ఎక్కించి ఇంటికి తిరుగుప్రయాణమయ్యారు. ఇంటికి రాగానే లాస్య ప్రమోద్ని గట్టిగా హత్తుకొని, “క్షమించండి, డాబుకు పొయ్యి నేను చెప్పిన అబద్ధాలు మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెడతాయని అనుకోలేదు. సిటీ అమ్మాయి, మిమ్మల్ని ఆటపట్టిద్దాం అని ప్రయత్నించాను. సినిమాలకు వెళ్ళిన మాట నిజమే, కానీ ఊర్లు తిరిగానని చెప్పినవి అబద్ధాలు. ఈ సారి అలా చేయను.” అంది.
“ఊరుకో లాస్య, ఇలా చేయబట్టేకదా, అత్తామామలు ఇంటికి వచ్చారు, మంచి వంటకాలు చేశారు. సెలవులు లేక, ఎటు వెళ్లలేని మనకు ఇలా సహాయపడ్డారు. ఊరకే రమ్మంటే ఇబ్బంది పడేవారేమో, కానీ కూతురు ఇబ్బంది పడుతోంది అని తెలియగానే వచ్చారు. నీ వంటింటి ఇబ్బందులు తీర్చారు. వాళ్ళు రావడం వల్లనే కదా, నీ మొహం లో మళ్ళీ ఆనందం చూసింది. వాళ్ళు రాబట్టే కదా నీ ఇష్టాయిష్టాలు తెలిసాయి. ఈ ట్రాన్స్ఫర్ వల్లనే మనం మన ఇళ్లకు దూరమయ్యాము.” అని ముగించాడు ప్రమోద్.
అండమాన్ ట్రిప్లో ప్రమోద్ తన గురించి తాను నిజయతీగా, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. కానీ లాస్య చాలా వరకు నిజాలు చెప్పినా, కొన్ని మటుకు ఇలా గొప్పలకు పొయ్యింది. ఈసారి ఇంటికి పిలిస్తే ప్రమోద్ తల్లితండ్రులనే పిలవాలి అని నిశ్చయించుకుంది. కాకపోతే అప్పటికి ఇల్లు సర్ది ఉంచాలి, ఎవరు బయట పడుకొని ఇబ్బంది పడకుండా. అప్పుడే గుర్తొచ్చింది లాస్యకు ప్రమోద్ మాట. “రాత్రికి చెప్తా అని మీ దగ్గర చాలాసార్లు విన్నాను. కానీ చెప్పిన ప్రతి రాత్రి, మీరు ఏం చెప్పకుండా మాట దాటేశారు. ఏం చెప్పాలనుకున్నారో ఇప్పుడు చెప్పండి.” అంది లాస్య.
ముగియటంతోనే, గట్టిగా లాగి బిగి కౌగిలి లో బందించి గట్టిగా ముద్దు పెట్టాడు ప్రమోద్. ఎటూ కదలలేక, అట్టే అటుక్కుపోయింది లాస్య. ఒక చేత్తో లాస్య రెండు చేతులు వెనక్కు బిగించి, రెండో చేత్తో నడుము గిల్లాడు. నొప్పి తో తలకదిలించింది. లాస్య పెదవులమీద, ప్రమోద్ పన్ను బలమైన గాటు వేసింది. “సారి” అని ప్రమోద్, లాస్య చేయి వదిలి, “దీని తర్వాత జరగే పనే, నా “రాత్రికి చెప్తా” కి అర్థం” అంటూ కన్నుకొట్టాడు ప్రమోద్.
సంవత్సరం తిరిగేసరికి ఇద్దరు, నలుగురయ్యారు, ఇంటి తీరు హుషారు.
❦


